4, నవంబర్ 2008, మంగళవారం

వెధవ (ఎదవ)

ఏం?? ఫీలయ్యారా??
ఇదే టైటిల్ ఏ నట వారస(వానర)రత్నమో పెట్టుకుని సినిమా తీసిఉంటే మొదట్రోజు ఆటకు ఎగబడి చొక్కాలవీ చించేసుకుని మరీ చూస్తారు కదా! ఐనా నేను వెధవ అన్నది మిమ్మల్ని కాదు లేండి, ఈ మధ్య అన్నీ ఇలాంటి టైటిల్సే హిట్లు కొడుతున్నాయి కదా అని అలా ట్రైల్ వేసా. అంటే.. అదీ.. మరీ.. బ్లాగర్లోకం లోకి నేను వదలదల్చుకున్న మొదటి బ్లాగు కదా ఆ మాత్రం హిట్ సెంటిమెంటు లేకపొతే వర్కవుట్ అవ్వదేమో అని.. హి హి హి! మరలాంటప్పుడు సెంటిమెంటు గా ఇలియానా లేదా అని పక్కన్నుంచి మా అశోక్ గాడి "వెధవ" డౌటు. సరే ఎలాగు టైటిల్ పెట్టేసాం కాబట్టి మనం కాసేపు ఎదవల గురించి మాట్లాడుకుందాం.

ఎవడ్రా అక్కడ నా భుజం తడిమింది .. అర్రె ఎవరూ లేరే.


ఇది రాస్తుంటే చిన్నప్పుడు మా తమ్ముడు చెప్పే ఒక డైలాగ్ గుర్తొచ్చింది-"అక్కడెవరో బాగా అల్లరి చెస్తుంటే టీచర్ వచ్చి కొట్టేసింది తీరా చూస్తే అక్కడెవరూ లేరు నేను తప్ప!!"

సరే సరే టాపిక్ లోకి వచ్చేస్తున్నా.... అసలు బ్లాగుల్లో ఏం రాయాలి అని ఓ ధర్మ సందేహం వచ్చి పడింది. మా అక్కేమో బ్లాగన్నదే మనిష్టం వచ్చినట్టు రాసుకోడానికి అని చెప్పింది, ఇంకేముంది ఇలా చెలరేగిపోడమె అనుకొని రాయడం మొదలు పెట్టేసా. ముందుగా మన గురించి మనం రాసుకోవాలిగా అని ఆలోచించగానే ఈ టైటిల్ గుర్తొచ్చింది. ఇప్పట్లో నేనెంత ఎదవనో నాకే తెలీదు అనుకోవడం ఫ్యాషన్ కదా!

మనమింతకీ ఎదవల గురించి మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు.. అసలీ వెధవల్లో చాలా రకాలున్నారు.

వెర్రి వెంగళప్ప వెధవలు :

మన అభిమాన సినిమా హీరోలు రివాల్వరు లోంచి వందలకొద్ది గుళ్ళు పేల్చేస్తున్నా కూడా డౌట్ రాని ప్రేక్షకులు, తొడ కొట్టి కుర్చీలను రైళ్ళను కదిలించగలిగే హీరోలను చూసి విజిళ్ళు వెసే అభిమానులు, మన క్రికెట్టు టీము ఆడిన ప్రతి సారీ గెలిచిపోద్ది అని బెట్టింగులు కట్టే అమాయకులు ఈ కోవలోకి వస్తారనమాట.

అతి తెలివి వెధవలు :

మనోళ్ళకు అసలు సినిమా తియ్యడమే రాదు అని కూడా, మొదట్రోజు ఆట మొదలవ్వగానే క్యూ లో నుంచొని సినిమా చూసేసి టీవీ ఛానెళ్ళ వాళ్ళొస్తే సినిమా సూపరు సూపరు సూపరోసూపరు అని చెప్పేవాళ్ళు, ఛ వాడికసలు క్రికెట్టే ఆడటం రాదు ఐనా కూడా టీము లొకి ఎలా సెలెక్టు అయ్యాడు అంటూ కమెంట్లు వేసే వాళ్ళూ, అసలు నేనయ్యుంటేనా ఈ పని నీకన్నా గొప్పగా చేసుండేవాడ్ని అని, ఎదీ చెయ్యిచూద్దాం అనేసరికి టాపిక్ మార్చేసే వాళ్ళూ... ఇంకా ఇలాంటి చాలామంది ఈ కోవలోకి వస్తారనమాట!

మూర్ఖపు వెధవలు :

నేచెప్పిందే కరెక్టు నాకు తెలీనిది ఎదైనా అసలు లేనట్టు అని ఫీలయ్యే వాళ్ళు, నేను చేసే పప్పు లో పెసరపప్పే వాడుతా అనే మా రూమ్మేటు లాంటి వాళ్ళు, నేనాడె టీముకు నేనే ఇంకా కాప్టెను అని భ్రమ పడే వాళ్ళు, పార్టీ పది ముక్కలైనా మనమే అధికారం లోకి వస్తామనుకునే రాజకీయ నాయకులూ..ఇలాంటివాళ్ళందరు ఈ క్యాటగిరి.

వెధవన్నర వెధవలు :

అసలీ ప్రపంచం లో అందరూ మంచోళ్ళే నాతో మాట్లాడే ప్రతోడూ నా ఫ్రెండే అనుకునే మా అశోక్ గాడి లాంటి అమాయక పక్షులు ఈ గూటి పక్షులు.

అసలు సిసలు వెధవలు :

ఈ పైన చెప్పిన ఏ క్యాటగిరీ లోకి మేము మాత్రం రాము అని భ్రమపడే వాళ్ళన్నమాట


ఐనా ప్రతి ఒక్కరిలో ఒక వెధవనేవాడు అంతర్లీనంగా దాగి వుంటాడు, మన దినచర్యల్లో సందర్భాన్ని బట్టి అవసరమైనప్పుడు అవసరమైన టైపు వెధవ బయటికొస్తుంటాడు అని మా అశోక్ గాడన్నాడు. నిజమే అనిపించినా ఒప్పుకోడానికి మనసొప్పక పోరా వెధవ అని తిట్టేసా.....

చిన్నప్పుడెప్పుడో మా మరదలోసారి బావా నువ్వొక వెధవ్వి అంటే తెగ ఉడుక్కున్నా కానీ కాసేపయ్యాక "వెధవ" అంటే "వెయ్యేళ్ళు ధనవంతుడిగా వర్ధిల్లు" అని అర్థం అని తను అనేసరికి నెమ్మది ఐపోయా .. అప్పటి నుంచి యెవడు వెధవ అని తిట్టినాసరే నవ్వేసుకుంటూ పోతూనే వున్నా !!!

తెలు"గోడు"

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా.....

అంటే ఇప్పుడు ఘనకీర్తి లేదా? ఉందో లేదో నిర్ణయించుకోవలసింది మనమే! ఏమంటారు? సరే అసలింతకి సంగతేంటంటే ఈ తెలుగు బ్లాగోగులలో నేను కూడా వో గోడు వెలగబెడదామని "తోటరాముడి లెక్క డిసైడ్ జేసిన" కాకపొతే సరదాగా హాస్యం రాయాలా? లేక సీరియస్ గా విధివిలాస్యం రాయాలా? (ప్రాసకోసం అలా పదప్రయోగాలవీ చెస్తూ వుంటా తెలుగు పండితులూ, క్షమించేసెయ్యండి) అని అర్ధం కాక బుర్ర గోక్కుంటున్నా. రెండూ కలిపి రాయడానికి నేనేమన్నా ఈకాలం లొ జాడ లేని గురజాడనా?

యేదో ఒకటి వచ్చింది రాసేయ్ మామా ఆనక చదివేవాడి ఖర్మ అని మా అశోక్ గాడన్నాడు. అలాగేనని రాయడానికి మొదలు పెట్టానా, అప్పుడే తెలిసింది ఈ తెలుగులో బ్లాగులు గట్రా రాయడం "అదంత వీజీ కాదని!"
మొదటిదే కదా, ఈసారికి మెల్లిగా రాద్దాం లే ఓపికగా అనుకునేలోపల మళ్ళీ మా అశోక్ గాడు "అరేయ్! లేక లేక మూడొచ్చింది ఇప్పుడు రాసేస్తావా లేదా" అని బెదిరించాడు. తప్పలేదు. ఏమాటకామాటే చెప్పుకోవాలి, పేజీలకు పేజీలు రాస్తున్న సాటి తెలుగు బ్లాగర్లూ మీకు జోహార్. ఇంగ్లీషు నుంచి తెలుగులో టైప్ చేసి రాయడం
..... "అదంత వీజీ కాదు!"