10, మే 2009, ఆదివారం

అమ్మా....

బుడ్డి గాడు అప్పుడే మొదటి సారిగా బళ్ళో చేరాడు. రోజూ ఆటోలో వెళ్ళి రావడం సరదాగానే వుంది. వాడితో పాటు ఆ కాలనీ నుంచి రెండో తరగతి అన్నలు మూడో తరగతి అక్కలు కూడా అదే ఆటో లో వెళ్తారు. ఆరోజు వాళ్ళు ఆటోలో ఏదో సినిమా చూసొచ్చి మటాడుకున్న మాటలు రాత్రి నిద్రలొ గుర్తొచ్చి 'భయం' తో అరిచిన అరుపు
అమ్మా...

చింటు కి పొద్దున్నే స్కూల్ కి టైం అవుతోంది. ఇల్లంతా అటు ఇటూ ఖంగారుగా తిరుగుతూ దేనికోసమో వెతుకుతున్నాడు. నిన్న స్కూల్ నుండి వచ్చాక ఆడుకోడనికెళ్ళేముందు ఎక్కడో పడేసిన టై ఇప్పుడు కనపడటం లేదు.అది లేకుండా స్కూల్ కి వెళితే పి.టి సారు ఎండలో నిలబెడతాడు. కాసేపు చూసి ఇంక టై కోసం టిఫిన్లు సర్దుతున్న అమ్మని 'అసహనం' తో కేకవేసాడు..
అమ్మా...

సరిత ఎనిమిదో క్లాసు చదువుతోంది. అప్పుడప్పుడే బాల్యం దాటిపొయ్యే వయసు. దారిన పోతూ వెకిలిగా చూసే కుర్రాళ్ళ చూపులు మెల్లిమెల్లిగా అర్థమవుతోన్న వయసు. ఇప్పుడు అనుకోకుండా ఈ 'అయోమయ ' పరిస్థితి. ఏం చెయ్యలో తోచక తలుచుకున్న పిలుపు
అమ్మా...

రాజేష్ కి గాల్లో తేలుతున్నట్టుగా వుంది. టెంత్ క్లాస్ రిసల్ట్స్ ఇప్పుడే వచ్చాయి. అనుకున్నదానికంటే చాలా బాగా మార్కులొచ్చాయి. స్కూల్ ఫస్ట్ వస్తుందని అనుకోలేదుకూడా! సంతోషంతో వుక్కిరిబిక్కిరి అవుతూ పరిగెడుతూ ఇంటికి వచ్చి పట్టలేని 'ఆనందంతో' పిలిచిన పిలుపు
అమ్మా...

కిరణ్ ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకో ఇరవై రోజుల్లో పరీక్ష. ఫ్రెండ్స్ అందరికీ ఈపాటికే హాల్ టికెట్స్ వచ్చేసాయి. తనదేమో ఎమైందో ఇంకా తెలీదు. తనేమో హాస్టల్లో వుండి ఎగ్జాం కోసం రెడీ అవుతున్నాడు. రోజూ హాల్టికెట్ కోసం ఇంటికి కాల్ చేస్తూనే వున్నాడు. ఈ రోజు కూడా అదేపని మీద ఫోన్ కాల్ చేసినప్పుడు హలో కన్నా ముందు 'ఆత్రం' గా వచ్చిన పదం
అమ్మా...

శివ ఇంజినీరింగ్ స్టూడెంటు. ప్రాజెక్టు పనికోసం కాలెజీ కూడా మానేసి రెండ్రోజులనుంచి కంప్యూటర్ ముందే కూర్చుని కదలకుండా పని చేసుకుంటున్నాడు. చాలాసేపటినుంచి దాహం గా వుంది కానీ కోడింగ్ మధ్యలో వదలకూడదు. ఇందాకట్నుంచి నీళ్ళకోసం అడుగుతున్నా కూడా కిచెన్ లో వంటపనుల్లో ఉన్న అమ్మకేమో వినపడటం లేదు. ఇంక ఆగలేక 'కోపం' గా అరిచిన అరుపు
అమ్మా...

లల్లి ప్రేమలో పడింది. కానీ నాన్నేమో చాల స్ట్రిక్ట్. అబ్బాయి వాళ్ళు ఫామిలీ ఫ్రెండ్సే. ఐనా ఇంట్లో ఎలా చెప్పాలో తెలీక మధనపడుతుంటే కనిపెట్టేసిన అమ్మొచ్చి ఏంటి లల్లి అదోలా వుంటున్నావు.. ఏమైందో చెప్పురా అని ప్రేమగా అడిగే సరికి కళ్ళవెంబడి నీళ్ళు అలా అప్రయత్నంగానే కారిపోతూ ఏం చెయ్యాలో తెలియని 'అసహాయ' స్థితిలో నోట్లోంచి వచ్చిన మాట
అమ్మా...

రాధ చిన్నప్పట్నుంచి అమ్మకూచి, ఒక్క సారిగా పెళ్ళి ఆ పైన భర్తకు వేరే వూళ్ళో వుద్యోగం ఇవన్ని వచ్చి మీద పడేసరికి ఏం చెయ్యలో అర్థం కావడం లేదు. వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అమ్మను చూసి ఇంకమీదట అమ్మకు దూరంగా ఒంటరిగా వుండాలన్న 'బాధ' ఏడుపుగా మారిన క్షణంలో అమ్మను గట్టిగా పట్టేసుకుని రోదిస్తున్నప్పుడు నోట్లోంచి వచ్చిన ఒకే ఒక్క మాట
అమ్మా...

పాపం రామం వాళ్ళ నాన్నగారు సడెన్‌గా పోయారు. ఢిల్లీలో జాబ్ చేస్తున్న రామం ఇరవైనాలుగ్గంటల ప్రయాణం లో బాధను పంటి బిగువున ఆపుకొని చిత్తూరు లో ఒక మారుమూల పల్లెలో వున్న సొంతింటికి వచ్చి, అప్పటికే గుండెలవిసి పోయేలా ఏడ్చి ఇంక ఏడుపు రాక శూన్యంలోకి చూస్తున్న వాళ్ళ అమ్మగారిని చూడగానే 'వైరాగ్యం' తో నోటనుంచి వచ్చిన పదం అమ్మా..

మునిమనవడితో ఆడుకుంటున్న వాళ్ళమ్మను చూసి పట్టాభి ఒక్క క్షణం ఉద్విగ్నతకు లోనయ్యాడు. కాలచక్రం గిర్రున అరవయ్యేళ్ళ వెనక్కు వెళ్ళి తను తప్పటడుగులేసే బాల్యం గుర్తొచ్చింది. అంతలో ముని మనవడ్ని ఆడిస్తున్న అమ్మ వున్నట్టుండి తూలడంతో 'ఖంగారుగా' అరిచాడు
అమ్మా... అని!

ప్రతి ఒక్కరు చిన్నప్పుడు మొదటిసారిగా మాట్లాడిన మాట 'అమ్మ '. కోపం, బాధ అసహనం, ఆత్రం .. ఎలా పిలిచినా సరే అమ్మా .. అనగానే ఆ తల్లి నుంచి చల్లగా వచ్చే సమాధానం - "ఏంటి నాన్నా, ఏమైందిరా కన్నా, చెప్పు బాబు.." ఇలా ఆప్యాయత, అనురాగం, శాంతం కలగలిపిన ఆ మాతృమూర్తిని చూడగానే, ఆవిడ మాట వినగానే ఏ బిడ్డకైన కలిగే అనుభూతి మాటల్లో చెప్పేది రాతల్లో రాయగలిగేది కాదంటే అతిశయోక్తి లేదు.
మదర్స్ డే (మాతృదినోత్సవం) సందర్భం గా పూజ్యనీయులైన తల్లులందరికీ నమస్సుమాంజలులు! శుభాభినందనలు!

ఈ టపా అమ్మకే అంకితం.

9 కామెంట్‌లు:

  1. చాలా చాలా బాగా చెప్పారు. అవును.. అమ్మ అనే పదంలోనే ఉంది ఆ మాధుర్యమంతా..!

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా చెప్పారు/రాసారు....

    రిప్లయితొలగించండి
  3. చాల బాగా రాసారు అమ్మ ప్రేమ గురించి !

    రిప్లయితొలగించండి
  4. అందరికీ చాలా థాంక్స్ అండి. అమ్మంటే అమ్మనే !
    మాతృదేవో భవ.

    రిప్లయితొలగించండి